అట్లతద్ది
మన దేశంలో ప్రతీ పండుగ మనకు విశేషమైన జ్ఞానం, విజ్ఞానం, ఆనందం, సుఖసంతోషాలను అందిస్తూనే ఉంటుంది..
అటువంటి గొప్ప పండుగలలో
"అట్లతద్ది"
చాలా విశేషమైనది...
అట్లతద్ది విశిష్టత:
తెలుగువారి విశిష్ట సాంప్రదాయాల్లో ఒకటి ‘అట్లతద్ది’. ఆశ్వయుజ బహుళ తదియనాడు మహిళలు జరుపుకునే ఈ పండగను కొన్ని ప్రాంతాల్లో ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. అట్ల తద్దెను కన్నె పిల్లలు జరుపుకోవడం వలన మంచి భర్త లభిస్తాడని నమ్మకం. ముత్తైదువులు తమ భర్తలు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్లతద్ది జరుపుకుంటారు. అందుకనే ఈ పండగ ముందు రోజున గోరింటాకు పెట్టుకుంటారు. పండగ రోజున తెల్లవారు జామునే నిద్ర లేచి..కన్నెపిల్లలు , ముత్తయిదువులు తలస్నానం చేస్తారు. తెల్లవారు జామున అన్నం, గోంగూర పచ్చడి , పెరుగుతో కడుపునిండా తింటారు. అనంతరం అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్ద పప్పోయ్ మూడట్లోయ్.. అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఉయ్యాలలూగుతారు. పగలంతా ఉపవాసం ఉండి.. రాత్రి చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడిని చూసి.. మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి అప్పుడు ఉపవాసం విడుస్తారు.
పూజా విధానం:
గౌరీ పూజ కోసం పూజా మందిరంలో పీఠాన్ని పనుపు , కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం , పసుపు , పువ్వులతో పూజిస్తారు. ఆ తర్వాత పార్వతీదేవికి అట్లు , ఇతర పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అనంతరం శక్తి కొద్దీ ముగ్గురుకానీ , ఐదుగురు కానీ ముత్తయిదువులకు వాయినం ఇస్తారు. గౌరీదేవి అనుగ్రహంతో తమ కుటుంబంలో సుఖ సంతోషం, సౌభాగ్యం కలకాలం నిలుస్తాయని నమ్మకం.