10-11-2022
కార్తిక బహుళ విదియ, గురువారం

పూజ అనే మాటకు అర్ధం ఏమిటి?
ప్ర. పూజ అనే మాటకు అర్ధం ఏమిటి?
జ. "పూః యేన జాయతే ఇతి పూజా" అని పురాణాల్లో నిర్వచనమిచ్చారు.
పూః- అంటే ఇష్టసిద్ధి, భోగం అని అర్ధాలు.
ఏ కర్మ వలన ఇష్టసిద్ధి లభిస్తుందో దానికి పూజ అని అర్ధం. భగవదర్చన వల్ల అభీష్టసిద్ధి లభిస్తుంది కనుక అర్చనకు 'పూజ' అనే శబ్దాన్ని వాడుతారు.

పూజ అనగా..
పూర్వ జన్మ వాసనలను నశింపచేసేది, జన్మ మృత్యువులను లేకుండా చేసేది, సంపూర్ణ ఫలాన్నిచ్చేది.
పూజ అనేది హిందువులు, బౌద్ధులు, జైనులు దేవతలకు భక్తి శ్రద్ధలతో చేసే ప్రార్థన.
అతిథికి ఆతిథ్యం ఇవ్వడం, గౌరవించడం లేదా ఒక కార్యక్రమాన్ని ఆధ్యాత్మికంగా జరుపుకోవడం ఆరాధన కూడా పూజయే.
పూజ అనే సంస్కృత పదానికి గౌరవం, నివాళి, ఆరాధన అని అర్థాలు. పూజలో దైవానికి దీపం, పువ్వులు, నీరు, ఆహారాన్ని ప్రేమపూర్వకంగా సమర్పించడం హిందూ మతం లోని ముఖ్యమైన ఆచారం.
ఆరాధించేవారికి, ఆరాధించే రూపంలో దైవత్వం కనిపిస్తుంది, దైవత్వం పూజించేవారిని చూస్తుందని హిందూ విశ్వాసం.
మానవుడికి, దేవునికీ మధ్య, మానవుడికీ గురువుకూ మధ్య జరిగే పరస్పర చర్యను దర్శనం అంటారు.
పూజ.. శాఖ, ప్రాంతం, సందర్భం, దేవుడూ, అవలంబించే ఆచారాలను బట్టి మారుతూంటుంది.
హిందూమతంలో పూజల్లో నిగమ, ఆగమ ఆచారాలు రెంటినీ ఆచరిస్తారు.
భారతదేశం లోనే కాక ఇతర దేశాలన్నింటిలో ఈ పూజా వ్యవహారాలున్నాయి...
ఉదాహరణకు ఇండోనేషియా లోని బాలిలో ఆచరించే హిందూ మతంలో ఆగమ పూజ ఎక్కువగా ఉంటుంది. ఇండోనేషియాలో పూజను సెంబహ్యాంగ్ అని పిలుస్తారు.