13-11-2022
కార్తీక బహుళ పంచమి, ఆదివారం
వింశాధ్యాయము
పృధు చక్రవర్తి అడుగుతున్నాడు : 'దేవర్షీ! తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణుపూజ చేయాలని సెలవిచ్చావు. పైగా తులసిని 'హరిప్రియా - విష్ణువల్లభా' వంటి పేరులతో సంబోధించావు. శ్రీహరికి అంతటి ప్రియకరమైన ఆ తులసీమహాత్మ్యాన్ని వినిపించు.
నారదుడు చెబుతున్నాడు 'శ్రద్ధగా విను.పూర్వమొకానొకసారి,ఇంద్రుడు సమస్త దేవతాప్సరసమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు భేతాళరూపియై వున్నాడు. భీత మహాదంష్ట్ర నేత్రాలతో మృత్యుభయంకరంగా వున్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక 'ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు.కానీ, ఆ పురుషోత్తముడు జవాబీయని కారణంగా 'నిన్ను శిక్షిస్తున్నాను. ఎవడు రక్షిస్తాడో చూస్తాను' అంటూ తన వజ్రాయుధంతో అయన్ని కంఠసీమపై కొట్టినాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం నల్లనయ్యిందిగాని ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదై పోయింది. అంతటితో ఆ భీషణ మూర్తినుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధంచేసేలా తోచడంతో, దేవగురువైన బృహస్పతి ఆ భేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి, ఇంద్రుడి చేత అతనికి మ్రొక్కించి, తానీ విధంగా శాంతి స్తోత్రం చేశాడు.
బృహస్పతి కృత భేతాళ శాంతి స్తోత్రం
శ్లో ||
నమో దేవాది దేవాయ త్ర్యంబకాయ కపర్దినే త్రిపురఘ్నాయ శర్వాయ నమోంధ కనిషూఇనే ॥
శ్లో ||
విరూపా యాదిరూపాయ బ్రహ్మరూపాయ
శంభవే యజ్ఞ విధ్వంసకర్తే వై యజ్ఞానాం ఫలదాయినే ॥
శ్లో ||
కాలాంత కాలకాలాయ కాలభోగి ధరాయచ నమో బ్రహ్మ శిరోహంత్రే, బ్రహ్మణ్యాయ నమో నమ: ||
బృహస్పతి ఈ విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోకనాశనమైన తన త్రినేత్రాగ్నిని ఉపసంహరించేందుకు నిశ్చయించి ' బృహస్పతీ! నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకుగాను ఇకనుంచి నువ్వు 'జీవ' అనే పేరుతో ప్రఖ్యాతి ఇకనుంచి నువ్వు 'జీవ' అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఏదైనా వరం కోరుకో' అన్నాడు.
ఆ మాట మీద బృహస్పతి 'హే శివా! నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్లీ అడుగుతున్నాను త్రిదివేశునీ త్రిలోకాలనూ కూడా నీ మూడోకంటి మంటనుంచి రక్షించు. నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతిపజెయ్యి. ఇదే నా కోరిక' అన్నాడు.
సంతసించిన సాంబశివుడు
'వాచస్పతీ! నా మూడోకంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి, అగ్ని లోకదహనం చేయకుండా వుండేందుకుగాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను' అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు. శివుడు. ఆ అగ్ని గంగాసాగరసంగమాన బడి బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చింది. ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాదిసత్యలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి 'ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడ' ని అడిగాడు. అందుకు సముద్రుడాయనకు నమస్కరించి
'గంగాసంగమంలో జన్మించాడు కనుక ఇతను నా కుమారుడే. దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయు' మని కోరాడు. ఈ మాటలు జరిగేలోపలే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకొని ఊగులాడసాగాడు. వాడి పట్టునుంచి తన గెడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ళ పర్యంతమైంది. అందువల్ల విధాత
' ఓ సముద్రుడా నా కళ్ళ నుంచి రాలిచిందిన నీటిని ధరించినకారణంగా వీడు జలంధరుడనే పేర విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త, వీరుడూ అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు' అని దీవించి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ జలంధరుడికి, కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు. రూప, వయో, బలవిలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి, దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు.
నవమోధ్యాయస్సమాప్త:
దశమాధ్యాయము
నారదుడు చెబుతున్నాడు: పూర్వం దైవోపహతమై పాతాళాదిలోకాలలో దాగిన దానవబలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి, నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి ' వీడికి తల లేదేమిటి? అని ప్రశ్నించిన మీదట శుక్రుడు, గతంలో జరిగిన క్షీరసాగరమథనం, అమృతపు పంపకం, ఆ సందర్భంగా విష్ణువతని తలతెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు. అంతా విన్న సముద్రతనయుడైన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రియైన సముద్రుని మథించడంపట్ల చాలా మధనపడ్డాడు. ఘస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు.
ఇంద్రుడి వద్దకు వెళ్ళి 'నేను రాక్షసప్రభువైన
జలంధరుడి దూతను. ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్రా! నా తండ్రియైన సముద్రుని పర్వతంతో మథించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు.' అది విన్న అమరేంద్రుడు
'ఓ రాక్షసదూతా! గతంలో నాకు భయపడిన లోకకంటకాలైన పర్వతాలనీ, నా శత్రువులయిన రాక్షసుల్నీ ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. పాతాళాదిలోకాలలో దాగిన దానవబలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి, నిర్భయంగా సంచరించసాగింది.
అందువల్లనే సముద్రమథనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్రనందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్రమథన కారణాన్నీ దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్నీ కూడా మీ నాయకుడికి విన్నవించుకో ' అని చెప్పాడు. మస్మరుడు జలంధరుడు దగ్గరకు వెళ్ళి మఘవుడు చెప్పిన మాటలను వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయసైన్యాలవారూ ముసల, బాణ, గదాద్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు.
రథ, గజ, తురగాదిక శవాలతోనూ, రక్తప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది.
రాక్షసగురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందర్నీ మృతసంజీవనీ విద్యతో బ్రతికిస్తూండగా, దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను, ద్రోణగిరి మీది
దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రములో పారవేయించాడు. ఎప్పుడయితే ద్రోణపర్వతం అదృశ్యమయిందో అప్పుడు బృహస్పతి, దేవతలను చూచి 'ఓ దేవతలారా! ఈ జలంధరుడు
ఈశ్వరాంశసంభూతుడు గాబట్టి, మనకు జయింపశక్యం కాకుండా వున్నాడు.అందువల్ల ప్రస్తుతానికి ఎవరిదారిన వాళ్ళు పారిపోండి'అని హెచ్చరించాడు. అది వినగానే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరుపర్వత గుహాంతరాళాలను ఆశ్రయించారు.
అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్రపదవిలో తాను పట్టాభిషిక్తుడై, శుంభనిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి, పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంతసైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు.
తొమ్మిదీ, పదీ అధ్యాయములు ఇరువదియవ (బహుళ పంచమి) రోజు పారాయణము సమాప్తము