దశ దిశలు
నలుదిక్కులు అనగా...
నలు మూలలు అనగా.....
అన్ని కలిపి ఎనిమిది దిక్కులు.
వీటితో పాటు
అన్ని దిక్కులను కలిపితే దశ దిశలు అవుతాయి...
మరి మన కీర్తి, మంచితనం దశ దిశలా వ్యాపించాలంటే...
ఈ దశమి నాడు(ఇవాళ) కార్తీకపురాణం 24,25 విని, భక్తితో ఈ పురాణా oతర్గతంగా చెప్పిన మంచిపనులు ఆచరించండి...
శుభం
కార్తీక మహాపురాణము
ఇరవైనాల్గవ రోజు పారాయణం
"ఈ క్రింది వీడియో పై క్లిక్ చేసి ఇరవైనాల్గవ రోజు అధ్యాయం వినండి
కార్తీక మహాపురాణము
ఇరవైఐదవ రోజు పారాయణం
"ఈ క్రింది వీడియో పై క్లిక్ చేసి ఇరవైఐదవ రోజు అధ్యాయం వినండి
🌺ఇరువది నాలుగవ మరియు ఇరవై ఐదవ రోజు పారాయణము🌺
ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకొన్న జలంధరుడు పునఃఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూవున్న ఆ మాయాగౌరిని చూసాడు శివుడు. చూసీచూడగానే ఉద్విగ్నమానసుడైన ఉగ్రుడు. యుద్ధాన్నీ, తన పరాక్రమాన్నీ, కర్తవ్యాన్నీ విస్మరించి ఉదాసీనుడై వుండిపోయాడు.
అదే అదనుగా జలంధరుడు ఆపుంఖశాణైకాలైన మూడుబాణాలను శివుని శిరసుపైనా, వక్షస్థలంపైనా, ఉదరమందునా ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు.
అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై, కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్రరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక అనేకమంది రాక్షసులు పారిపోసాగారు. ఆలా పారిపోతున్న వారిలోవున్న అగ్రనాయకులైన శుంభ నిశుంభులను చూచిన రుద్రుడు పారిపోతున్నవాళ్లంతా పార్వతి చేతిలో మరణించెదరు గాక' అని శపించాడు. అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. జలంధరుడు పరిఘాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా గొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగుతీయసాగింది. దానిని మళ్ళించడం సాంబశివునికి కూడా సాధ్యంకాలేదు. వెనువెంటనే 'సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు.
భూమ్యాకాశాలను దహింపచేసివేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది. అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు, ఈశ్వరునిలో లీనమైపోయింది.
బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులూ, అవనత శిరస్కులూ అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు. స్తుతించారు. కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం 'బృందామోహితుడై అడవులలోబడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా
అనుగ్రహించమని' కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధ్వానాల నడుమ సకలగణసమేతుడై గృహోన్ముఖుడయ్యాడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు.
దేవతాకృత మహామాయ ప్రార్థనం
శ్లో॥
య దుద్భవాస్సత్వ రజస్తమో గుణాః సృష్టి స్థితి ధ్వంస నిదాన కారిణః య దిచ్ఛయా విశ్వమిదం భవా భవౌ తనోతి మూల ప్రకృతి నతాస్మృతామ్ || 1
శ్లో ||
యాహి త్రయోవింశతి భేద శాబ్దితా య ద్రూపకర్మాత్రి జగు స్త్రీ యోపివై జగత్యశేషే సమధిష్ఠితా పరా వేదాస్తు మూల ప్రకృతిం నతాస్మృతామ్ || 2
శ్లో || యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం దారిద్య్ర భీమోహ పరాభవాదీన్ నప్రాప్నువంత్యేవహి భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతాస్మృతామ్ || 3
1. సృష్టిస్థితి లయలకు కారణమైన సత్త్వ రజస్తమో గుణాలు మూడు దేనినుంచి పుట్టినవో, దేని యొక్క ఇఛ్ఛ వలన లోకంలో జనన, మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూలప్రకృతి (మహామాయ) కి నమస్కరిస్తున్నాను.
2. ఏదైతే ఇరవైమూడు భేదములతో చెప్పబడి సమస్తలోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతము దేని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూలప్రకృతికి నమస్కరిస్తున్నాను.
3. దీనియందు భక్తుడైనవాడు దరిద్రభయ, మోహ, పరాభవాలను పొందడో, ఏదయితే తన భక్తులయందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను.
నారదోవాచ:
స్తవమే తత్త్రి స్సంధ్యాం యః పఠే దేకాగ్రమానసః దారిద్ర్యమోహ దుఃఖాని న కదాచిత్ స్పృశంతి తమ్ ||
నారదుడు చెబుతున్నాడు: దేవతలచే గావించబడిన ఈ మూలప్రకృతి (మహా మాయా) స్తవాన్ని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో త్రిసంధ్యలూ పఠిస్తారో వాళ్లేనాడూ కూడా దారిద్ర్యమునుగాని, భయాన్నిగాని, మోహాన్నిగాని, దుఃఖాన్నిగాని, అవమానాన్ని గాని పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దాము.
ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సొకటి పొడచూపి ఓ దేవతలారా! త్రిగుణాలరీత్యా నేను త్రిమూర్తులనూ ధరించి వున్నాను.
రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన - సరస్వతిగానూ, సత్త్వగుణం వలన పార్వతిగానూ విలసిల్లుతున్నది నేనే కావున,మీ వాంఛాపరిపూర్తికై ఆ లక్ష్మీ-పార్వతీ-సరస్వతులను ఆశ్రయింపు'డని ఆదేశించి అంతర్థానమై పోయింది.
దేవతలు రమా, ఉమా, సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలలైన ఆ తల్లులు ముగ్గురూ వారికి కొన్ని బీజాలనిచ్చి 'విష్ణువు ఎక్కడయితే మోహావృతుడై వున్నాడో అక్కడీ బీజాల్ని చల్లండి' అని చెప్పారు. దేవతలా బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందా చితాప్రాంతమంతటా చిలకించారు.
ఓ పృథు భూపతీ! పాతివ్రత్యమహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తంతో చదివిన స్త్రీలుగానీ, పురుషులుగానీ, ఇహంలో సంతానసంపదనూ పరంలో స్వర్గసంపదనూ పొందుతున్నారు అన్నాడు నారదుడు.
సప్తదశోధ్యాయ స్సమాప్తః (పదునేడవ అధ్యాయము సమాప్తము)
అష్టదశాధ్యాయము
పునః నారదుడు ప్రవచిస్తున్నాడు: ఓ పృథు మహారాజా! పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాలవల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే మూడురకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకూ బృందామోహముతో మందుడై వున్న విష్ణువు తనచుట్టూ చెట్లయి మొలిచిన లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ మహిమలవలన, కోలుకున్నవాడై అనురాగపూరితహృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కాని, వాటిలో లక్ష్మీదత్తబీజాలు
ఈర్ష్యగుణాన్వితాలయి ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన 'మాలతి' బర్బరీ నామధేయమై, విష్ణువునకు ఎడమయ్యింది. కేవలం అనురాగపూరితాలయిన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహవిముక్తుడై, ధాత్రీ తులసీ సమేతుడయి సర్వదేవతా నమస్కారాలనూ అందుకుంటూ వైకుంఠానికి తరలివెళ్ళాడు. అందువల్లనే కార్తీకవ్రతంలోని విష్ణుపూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతే కాద
తులసీ మహిమ
ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థస్వరూపమై వర్థిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు. సర్వపాపసంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో, వారికి యమధర్మరాజును దర్శించే పని వుండదు. అనగా, నరకానికి వెళ్లరనీ, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారనీ భావము. గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం, ఈ మూడూ సమానఫలదాయకాలేనని చెప్పబడుతూంది. తులసిని ప్రతిష్టించినా, తడిపినా, తాకినా, పెంచినా, మానసిక శారీరక పాపాలేగాక, మాటలవలని పాపాలూ కూడా మటుమాయమై పోతాయి.
తులసి గుత్తులతో శివ, కేశవులను అర్చించినవాడు. ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది. నదులు, విష్ణ్వాది దేవతలు తులసిదళాలలో నివసిస్తూంటారు. ఎన్ని పాపాలు చేసినవాడైనాసరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో, అటువంటి వానిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటివాడు. విష్ణుసాయుజ్యాన్ని పొందుతున్నాడనడం సత్యం. ముమ్మాటికీ సత్యం.
తులసి చెట్లయొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెంకూడా అంటవు. తులసీవనపు నీడలో పితృశ్రాద్ధము చేసినట్లయితే, అది పితరులకు అక్షయపదాన్నిస్తుంది. అదే విధంగా
ధాత్రీ (ఉసిరి) మహిమ |
ఉసిరిచెట్టు నీడను పిండప్రదానం చేసినవారి పితరులు నరకంనుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సుపైనా, ముఖమందునా, దేహమందునా, చేతులందునా ఉసిరిపండును ధరిస్తున్నాడో వాడు. సాక్షాత్ విష్ణుస్వరూపుడని తెలుసుకోవాలి.
ఎవడి శరీరంపై ఉసిరిక ఫలమూ, తులసీ, ద్వారకోద్భవమైన మృత్తికా వుంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో. ఉసిరిపండ్లనీ, తులసీదళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తత్ క్షణమే గంగాస్నానఫలం లభిస్తుంది.
ఉసిరిపత్రితోగాని, ఫలాలతోగాని దేవతాపూజ చేసినవాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీకమాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్ధసేవనాలు విశేష ఫలితాలనిస్తాయి. సమస్త దేవతలూ, మునులూ కూడా ఈ కార్తీకమాసంలో ఉసిరికచెట్టుని ఆశ్రయించుకుని వుంటారు.
ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశినాడు తులసిదళాలను, కార్తీకం ముప్పదిరోజులలోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీకమాసంలో ఎవడైతే ఉసిరిచెట్టు నీడన భోజనం చేస్తాడో, వాడియొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది.
ఉసిరినీడన విష్ణుపూజ చేసినట్లయితే అన్ని విష్ణు | క్షేత్రాలలో శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలనీ, మహిమలనీ చెప్పడానికి ఏ ఒక్కరికీ కూడా ఎలాగైతే సాధ్యం కాదో, అదే ప్రకారం ఈ తులసీ ధాత్రీ వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గానీ, సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యంకాదు.
ఈ ధాత్రీ తులసీ జననగాధ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో, వాళ్ళు తమతమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడి శ్రేష్ఠమైన విమానంలో స్వర్గాన్ని చేరుతున్నారు.
పదునేడవ, పదునెనిమిదవ అధ్యాయములు ఇరువది నాలుగవ (బహుళ నవమి) నాటి పారాయణం సమాప్తం