కార్తీక మహాపురాణము
ఇరవైతొమ్మిదవ రోజు పారాయణం
కార్తీక మహాపురాణము
ముప్పైవ రోజు పారాయణం
ఇరువది తొమ్మిదవ రోజు
సప్తవింశోధ్యాయము
నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతియనే తన దూతను తోడిచ్చి, నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు. ఆ దూత, ధనేశ్వరుని తనతో తీసుకొనివెడుతూ మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వివరించసాగాడు.
తప్తవాలుకము:
ఓ ధనేశ్వరా! మరణించిన వెంటనే, పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరముకలవారై దిక్కులు ప్రక్కలయ్యేలా రోదించుతూ ఉంటారు. దీనినే 'తప్తవాలుక నరకము' అంటారు. వైశ్వదేవపరులైన అతిధులను పూజించనివారూ, గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవులను వేదవిదులను యజమానిని కాళ్లతో తన్నినవారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు.
అంధతామిశ్రమము:
ఈ నరకములో సూదిమొనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను దొలిచివేస్తూ ఉంటాయి. ఇది పదహారు రకములుగా కుక్కలు, గ్రద్దలు, కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాన్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండింపబడుతుంటారు.
క్రకచము:
ఈ నరకం మూడవది. ఇక్కడ పాపాత్ములను అడ్డముగానూ, నిలువుగానూ, ఏటవాలుగానూ, సమూలముగానూ, అంగాంగాలుగానూ రంపాలతో కోస్తుంటారు.
అసిపత్రవనం:
నాలుగవ నరధోరణి అయిన దీనినే అసిపత్రవనం. అంటారు. భార్యా-భర్తలను, తల్లిదండ్రుల నుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుచ్చబడి అసిపత్రాలచే శరీరాలు చించబడి, ధారలుగా కారే నెత్తుటివాసనకు వెంటబడి తరిమే తోడేళ్ళగుంపులకు భయపడి, పారిపోవాలని పరుగులు తీసి, పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు. చంపుట, భేదించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది.
కూటశాల్మలి
పదహారు రకాలుగా దండించేదీ పరస్త్రీలనూ, ద్రవ్యాన్నీ హరించే వాళ్ళూ, పరాపకారులూ అయిన పాపులు ఉండేదీ 'కూటశాల్మలీ' నరకం.
రక్తపూయము:
'రక్తపూయ' మనే ఈ విభాగం ఆరవనరకం. ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వ్రేలాడుతూ యమకింకరులచేత దండించబడుతూ ఉంటారు. ఎవరైతే తమ కులాచారరీత్యా తినకూడని వస్తువులు తింటారో, పరులను నిందిస్తారో, చాడీలు చెబుతుంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు.
కుంభీపాకము:
మొట్టమొదట నీకు విధించబడినదీ ఘోరాతి ఘోరమైనదీ, నరకాలన్నిటిలో నికృష్టమైనదీ అయినది ఈ 'కుంభీపాకమే ఏడవ నరకం. దుష్టద్రవ్యములు, దుర్భరాగ్ని కీలలు, దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది
గౌరవము:
నరకాలలో ఎనిమిదిదైన ఈ 'గౌరవం' దీర్ఘకాలికమని తెలుసుకో. ఇందులో పడినవారు కొన్ని సంవత్సరములుదాకా బయట పడలేరు.
ధనేశ్వరా! మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమనీ, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమనీ అంటారు. ఆ రెండు రకాల పాపాలూ కలిపి ఏడూ విధాలుగా ఉన్నాయి.
ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలూ వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి. కానీ, నువ్వు కార్తీకవ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమితపుణ్యం కలిగినవాడవు కావడంవలన ఈ నరకాలను కేవలం దర్శనమాత్రంగానే తరించగలిగావు. పై విధంగా చెబుతూ యమదూతయైన ప్రేతాధిపతి, అతనిని యక్షలోకానికి చేర్చాడు. అక్కడ అతడు యక్షరూపుడై, కుబేరునకు ఆప్తుడై, ధనయక్షుడనే పేరును పొందాడు.
విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరచిన ధనయక్షతీర్థం ఇతని పేరు మీదనే సుమా! అందువలన, సత్యభామా! పాపహారిణీ, శోకనాశినీ అయిన ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరనడంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు' అని సత్యభామకు చెప్పినవాడై శ్రీకృష్ణుడు సాయంసంధ్యానుష్టార్ధమై స్వీయగృహానికి వెళ్లాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు.
సప్తవింశోధ్యాయ సమాప్తః (ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము)
అష్టావింశోధ్యాయము
సూత ఉవాచః
ఈ కార్తీకమాసము పాపనాశిని, విష్ణువుకు ప్రియంకరి, వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయినీ అయి ఉంది. కల్పోక్త విధంగా ముందుగా విష్ణు జాగరణము, ప్రాతఃస్నానము, తులసీసేవ, ఉద్యాపనం, దీపదానం అనే ఈ అయిదింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించినవారు ఇహాన భుక్తిని పొందుతున్నారు. పాపాలు పోవాలన్నా, దుఃఖాలు తీరాలన్నా, కష్టాలు కడతేరాలన్నా కార్తీకవ్రతాన్ని మించినది మరొకటి లేదు. ధర్మార్దకామమోక్షాలు నాలుగింటికోసమూ ఈ కార్తీకవ్రతం ఆచరించవలసి ఉంది. కష్టములలో ఉన్నవాడైననూ, దుర్గారణ్యగతుడైనా, రోగి అయినా సరే మానకుండా శివాలయంలోనో, విష్ణ్వాలయంలోనో, హరి జాగరణాన్ని ఆచరించాలి. శివవిష్ణుదేవాలయాలు చేరువలో లేనప్పుడు. రావిచెట్టువద్దగాని, తులసీవనంలోగాని వ్రతం చేసుకోవచ్చును.
విష్ణు సన్నిధానంలో విష్ణుకీర్తనలు ఆలపించేవాళ్లు సహస్ర గోదానఫలాన్నీ, వాద్యాలు వాయించే వాళ్ళు అశ్వమేధ ఫలాలనీ, వర్తకులు సర్వతీర్థాల స్నానఫలాన్నీ పొందుతారు. ఆపదలలో ఉన్నవాడూ, రోగీ మంచినీరు దొరకనివాడూ వీళ్ళు కేశవనామములతో లాంఛన మార్జనమాచరించితే చాలు. వ్రతోద్యాపనకు శక్తి లేనివాళ్లు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది.
శ్లో||
అవ్యక్త రూపిణో విష్ణో స్వరూపో బ్రాహ్మణోభువి |||
శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు. కావున కార్తీకం బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం. అందుకు గాను శక్తిలేనివాళ్ళు గోపూజ చేసినా చాలును. ఆపాటి శక్తయినా లేని వాళ్ళు రావి, మర్రి వృక్షాలను పూజించినంతమాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు.
దీపదానం చేసే స్థోమతలేనివారు, దీపారాధనకైనా తాహతులేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటివలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు. పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి.
రావి మర్రి
సూతుడు చెప్పినది విని ఇతర వృక్షములన్నిటికంటే కూడా రావి, మర్రి వృక్షాలు మాత్రమే గోబ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగారు మునులు. అప్పుడు సూతుడు. పూర్వమొకసారి పార్వతీ పరమేశ్వరులు మహాసురతభోగంలో ఉండగా కార్యాంతరం వలన
దేవతలు, అన్నీ కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్లి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు. అందుకు పార్వతీదేవి'సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి. అటువంటిది మీరు మా దంపతులు సంభోగసుఖాన్ని చెడగొట్టారు. నాకు సురతసుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లయి పడిఉండండి' అని శపించింది.తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది. ఆ పరిణామంలో బ్రహ్మ పాలాశవృక్షంగానూ, విష్ణువు అశ్వత్థంగానూ, శివుడు
వటముగానూ మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేకపూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే రావి, మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది. వీటిలో రావిచెట్టు శనిదృష్టికి సంబంధితమైన కారణంగా శనివారంనాడు మాత్రమే పూజనీయమైంది. ఇతర వారాలలో రావిచెట్టును తాకరాదు సుమా! అంటూ చెప్పడాన్ని ఆపాడు. సూతుడు.
(ఇరువది ఏడు - ఇరువది ఎనిమిది అధ్యాయములు) ఇరువది తొమ్మిదవ (బహుళ చతుర్దశి) రోజు పారాయణము సమాప్తము.
ముప్పదియవ రోజు
పారాయణము ఏకోన త్రింశతితమాధ్యాయము
సూతప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు ఓ మునిరాజా! రావిచెట్టు ఎందువలన అంటరానిదయ్యింది. అయినప్పటికీ శనివారంనాడు . మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది? అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధానపరచసాగాడు.
రావిచెట్టు - దరిద్రదేవత :-
పూర్వం క్షీరసాగరమథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మినీ, కౌస్తుభాన్నీ శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి, శ్రీదేవిని పెండ్లి చేసుకోదలచాడు. కానీ శ్రీదేవి 'ఓ నారాయణా! నాకన్నా పెద్దది నా అక్కయ్య వున్నది. జ్యేష్ఠకు పెండ్లికాకుండా కనిష్ఠనయిన నేను కళ్యాణమాడటం పాడిగాదు గనుక ముందామె మనువుకై సంకల్పించ'మని కోరింది. ధర్మబద్ధమైన 'రమ' మాటలను అంగీకరించి, విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్టాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్రరదన, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు గలిగిన జ్యేష్టాదేవిని, ఉద్దాలకుడు. తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. దరిద్రదేవతకు ఇష్టమైన స్థలములు నిరంతర హోమధూమ సుగంధాలతోనూ, వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి, పెద్దమ్మ దుఃఖిస్తూ
'ఓ ఉద్దాలకా! నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేదీ, అతిధి పూజాసత్కారాలు జరిగేవి, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవీ అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు వున్న చోటగాని, పితృదేవతలు పూజింపబడే చోటగాని, ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్టుడు ప్రేమగా మాటలాడేవాడు గురుపూజాదురంధరుడూ వుండే స్థలాలలోగాని నేను ఉండను. ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్లు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ వుంటారో, ఏ ఇంట్లో అతిధులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడయితే దురాచారాలూ, పరద్రవ్య, పరాభార్యాపహరణ శీలురైన వారుంటారో అలాంటి చోటులోనయితేనే నేను వుంటాను. కల్లు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాదిపాతక పురుషులు ఎక్కడ వుంటారో నేనక్కడ ఉండటానికే ఇష్టపడతాను' అంది రావి మొదట్లో జ్యేష్టావాసం ఆమె మాటలకు వేదవిదుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడై 'ఓ జ్యేష్ఠా! నీవు కోరినట్లుగా నీకు తగిన నివాసస్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వీ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు.
ముప్పదియవ అధ్యాయం
భర్త ప్రకారం జ్యేష్టాదేవి రావి చెట్టు మొదలులోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతివిరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్దపెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో వున్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలాసమేతుడై జ్యేష్టాదేవి ఎదుట ప్రత్యక్షమై, ఆమెను ఊరడించుతూ
'ఓ జ్యేష్టాదేవీ! ఈ రావిచెట్టు నా అంశతో కూడి వుంటుంది. కనుక, నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని వుండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది' అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయంగానూ, అక్కడ జ్యేష్టాదేవిని షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయై అనుగ్రహించేటట్లున్నూ ఏర్పరచాడు శ్రీహరి.
'ఓ ఋషులారా! సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథుచక్రవర్తికి చెప్పబడిన విధానంగా, నేను మీకీ పద్మపురాణాంతర్గత కార్తీకపురాణాన్ని వినిపించాను.
ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండీ విడివడి | విష్ణుసాయుజ్యాన్ని పొందుతున్నారు' అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుంచీ బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు.
ఇరువది తొమ్మిది, ముప్పది - అధ్యాయములు ముప్పదియవ (బహుళ అమావాస్య) రోజు పారాయణము సమాప్తము
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు
ఓం సర్వేషాం శాంతిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణం భవతు
ఓం శ్శాంతి శ్శాంతి::