కార్తీక మహాపురాణము
ఎనిమిదవ రోజు పారాయణం

02-11-2022
కార్తిక శుద్ధ నవమి, బుధవారం.

అక్షయ నవమి పర్వదినం.
'అమాలక నవమి' యొక్క గొప్పతనాన్ని 'పద్మ పురాణం' మరియు 'స్కాంద పురాణం'లో పేర్కొన్నారు. పురాణాల ప్రకారం, 'సత్య యుగం' అని అందరిచే కీర్తింపబడే కృతయుగం ప్రారంభమైనది కార్తీక శుద్ధ నవమి నాడే.
పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు 'కుష్మాండుడు' అనే రాక్షసుడిని ఓడించి అధర్మ వ్యాప్తిని అడ్డుకున్నాడు. కాబట్టే అక్షయ నవమిని 'కుష్మాండ నవమి' గా కూడా ప్రసిద్ధికెక్కినది.ఈ రోజును జగద్ధాత్రి పూజ అని కూడా పిలుస్తారు.ఈ రోజున జగదంబను ధాత్రి వృక్ష (ఉసిరి చెట్టును) రూపంలో జగధాత్రిగా పూజిస్తారు.
బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభంలో తపస్సు చేసి కళ్ళు తెరవగానే ఆయన నేత్రముల నుంచి వొచ్చిన ఆనందబాష్పాలు రాలినాయి. అందు నుంచి ధాత్రి (ఉసిరి) వృక్షం వొచ్చినది ఈ రోజే కనుక నేడు ఆమలక నవమి అని ప్రసిద్ధికెక్కిందని ఐతిహ్యం.ఈ రోజున ఉసిరి చెట్టు కింద ఆహారాన్ని వొండి తినటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఆచారం మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.
ఉసిరి చెట్టుకి పూజ ఎలా చేయాలి ?
కార్తీక శుద్ధ నవమి నాడు ఆమలక (ఉసిరి) చెట్టు చుట్టూ శుభ్రం చేసి 8 వైపులా అష్టదళ పద్మాలులా ముగ్గులు వేసి గోపాదుక ముద్రలు వేసి, శంఖ, చక్రాలు పెట్టాలి, 8 వైపులా దీపలు పెట్టాలి.పద్మపురాణం ప్రకారంగా అయితే 108 ప్రదక్షిణాలు చేయాలి. కనీసమ్ 8 ప్రదక్షిణాలైనా చేయాలని ఉంటుంది. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆమలక (ఉసిరి) వృక్షం చుట్టూ ఎర్రని దారంతో తోరబంధానం చేయమని చెపుతారు.చెట్టుకి తోరం కట్టేటప్పుడు ఈ క్రింది శ్లోకాలను చదువవలెను.
శ్లో.ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి!
పుత్రాన్ దేహి మహాప్రజ్ఞా, యశోదేహి బలంచమే!!
శ్లో.ప్రజ్ఞాం,మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం!
నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా!!
తాత్పర్యం:- ఓ ధాత్రీదేవి! నీకు నమస్కారము. మా పాపములను పోగొట్టి పుత్రులను, యశస్సును, బలమును, ప్రజ్ఞ, మేధ, సౌభాగ్యాన్ని శాశ్వతమైన విష్ణు భక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదించుము. ఉసిరి చెట్టు నీడలో దీపమ్ పెట్టండి, కానీ కొమ్మలు కాలే లాగ కాకుండా దూరంగ పెట్టండి.
ఆమ్లా నవమి కి ఆమల (ఉసిరి చెట్టు) వృక్షం యొక్క ఆరాధన చాలా ముఖ్యమైనది.ఈనాడు ఉసిరి చెట్టు మూలంలో శ్రీ తులసి,ధాత్రి సహిత లక్ష్మి నారాయణులను, పరమేశ్వరుని పూజించిన పిదప బ్రాహ్మణులకు ఉన్నితో చేసిన వస్త్రాలు, గోవులు మొదలగునవి దానాలు చేసి. అక్కడే భోజనాలు పెట్టి దక్షిణాతాంబూలాలను అర్పించి. వారి శుభాశీస్సులు పొంది. అనంతరం తాము కూడా ఆ ఉసిరి చెట్టు నీడలోనే భోజనం చేయాలి.
ఈ రోజు చేసే స్నాన, దాన, జప అనుష్ఠానాలు అక్షయమైన (అనంతమైన) ఫలితాన్ని అనుగ్రహిస్తాయని శాస్త్రం. ఈ రోజు ప్రదోష సమయంలో అరటి చెట్టు దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణ, ఇష్టదేవతా మంత్ర జపం చేసుకోవడం చాలా శుభాలను, సిద్ధిని కలగచేస్తుంది.
ఈరోజు చేయాల్సినవి
- ★ నదీ స్నానం
- ★ ఉసిరి చెట్టు వద్ద దీపారాధన
- ★ దీప దానం
- ★ విష్ణు సహస్రనామ పారాయణ
- ★ కార్తీక పురాణం పఠనం/శ్రవణం
- ★ పంచాక్షరీ, అష్టాక్షరీ జపం
- ★ అరటి ఆకులో భోజనం