



విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా దేవిని ఈరోజు "శ్రీ దుర్గా దేవి" అవతారంలో అలంకరించి అర్చిస్తారు.
శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి. ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ (పురుషుడు), ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు. దుర్గా దేవి ఆది పరాశక్తి యొక్క సమీప రూపాంతరము. ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి దేవత అయిన దుర్గా దేవి. దుర్గా దేవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము. అయితే, అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిదీ, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది.
ప్రాతః స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ || 1 ||
ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ |
మాణిక్యహేమవలయాంగదశోభమానాం
పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ || 2 ||
ప్రాతర్నమామి లలితాచరణారవిందం
భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ || 3 ||
ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |
విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ || 4 ||
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి |
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి || 5 ||
యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే |
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ ||
ప్రాముఖ్యత
పార్వతీ దేవిగా అవతరించే ముందు ఆది పరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనని తాను పరిచయం చేసుకొని అతనికి దివ్యోపదేశము చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించింది. వేదములలోని పదములతో పరాశక్తి అయిన తనకి ఆద్యంతాలు లేవని వివరించింది. విశ్వంలో తానే అఖండ సత్యమని తెలిపినది. ఈ విశ్వమంతయు తన సృష్టియేనని, తనే పరబ్రహ్మ స్వరూపము అని రహస్యము తెలిపినది. జయం, విజయం తానేనని, వాటి రూపాంతరాలు కూడా తానేనన్న సత్యము తెలిపినది. బ్రహ్మ తన స్పష్టమైన రూపాంతరమేనని, విష్ణువు తన అస్పష్టమైన రూపాంతరమని, శివుడు తన అతిశయ రూపాంతరమని తెలిపినది. ఎవరూ కని, విని, ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకి చూపినది. సత్యలోకాన్ని తన నుదుట, విశ్వాన్ని తన కురులలో, సూర్యచంద్రులను తన కళ్ళుగా, నాలుగు దిక్కులను తన కర్ణాలుగా, వేదాలనే తన పలుకులుగా, మృత్యువు, అనురాగం, భావోద్రేకాలను తన దంతాలుగా, మాయను తన చిరునవ్వుగా చూపినది.
వైష్ణవ పురాణాలలో ఆది శక్తి
వైష్ణవులు ప్రత్యేకంగా శక్తిని ఆరాధించకపోయిననూ మాయని, యోగమాయని నమ్ముతారు. రాధని మూల ప్రకృతిగా ఆరాధిస్తారు
బ్రహ్మ పురాణం
బ్రహ్మ పురాణం మాత్రం వీటికి విరుద్ధంగా ఆది పరాశక్తి అనే బీజము తనని తాను పురుషుడు, ప్రకృతిగా విభజించుకొన్నదని తెలుపుతుంది. ఆది బీజం కృష్ణుడుకి, కాళికి జన్మనిచ్చింది. తర్వాత కాళి లలితా త్రిపుర సుందరిగా అవతరించి, రెండు బుడగలని సృష్టించింది. మొదటి బుడగ నుండి విష్ణువు అవతరించి బ్రహ్మకి, గౌరికీ జన్మనివ్వగా, గౌరి సతిగా, పార్వతిగా రూపాంతరం చెందినది. రెండవ బుడగ నుండి శివుడు, రాధ అవతరించారు. రాధ తర్వాత లక్ష్మిగా, సరస్వతిగా, గంగగా అవతరించినది
శైవ పురాణాలలో ఆది శక్తి
శివ పురాణంలో శివుని ఎడమ సగభాగం నుండి ఆది పరాశక్తి పరమ ప్రకృతిగా అవతరించినట్లు ఉంది. లింగ పురాణంలో ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమైన పార్వతి యోనిగా, శివుడు లింగంగా అవతరించి వీరి సంగమమే జీవోద్భావన గావించినట్లు తెలుపుతుంది. స్కంద పురాణం, మార్కండేయ పురాణం దుర్గ లేదా చండి సకల జగత్తుకీ ఆది దేవత అనీ, ఈ రూపాంతరమే ఆది శక్తి యొక్క భౌతిక రూపమనీ తెలుపుతున్నవి
శాక్త పురాణాలలో ఆది శక్తి
దేవీ భాగవత పురాణం ప్రకారం బీజ మంత్రమైన "క్లీం"ని జపిస్తూ శివుడు ఆదిశక్తి పై దృష్టి కేంద్రీకరించి వేల యేళ్ళ కొలదీ ధ్యానం చేసాడు. శివుడి ఎడమ భాగం నుండి సిద్ధిధాత్రిగా రూపాంతరం చెంది శివుడికి ఆది శక్తి ప్రత్యక్షమైనది. అందానికి, శక్తికీ దేవత అయిన పార్వతి ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమని (మానవ రూపం) తెలుపబడింది. సత్వ, రజో, తమో గుణములు కలిగిన పార్వతీ దేవి, ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము.



నవదుర్గల అలంకారాల్లో ఎనిమదవ అవతారం. నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలనూ ఈ అమ్మవారు తీర్చగలదు. జీవితంలోని కష్టాలన్నిటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చు అని భక్తుల నమ్మిక. మహాగౌరీదేవినాలుగు చేతులుతో ఉంటుంది. కుడిచేయి అభయముద్రలో ఉండగా, కింది కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. కింది ఎడమ చేతిలో ఢమరుకం ఉండగా, పై ఎడమ చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది.
మహాగౌరి అనే పేరు గొప్ప తెలుపు అని అర్ధం, దుర్గాదేవి తెలుపు రంగులో, చాలా అందంగా ఉంటుంది. (మహ, మహా = గొప్ప; గౌరీ, గౌరీ = తెలుపు). మహాగౌరీని సాధారణంగా నాలుగు చేతులతో చిత్రీకరిస్తారు, చేతులు త్రిశూలం, కమలం, ఢమరుకం కలిగి ఉంటాయి, నాల్గవది ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు కమలం కూడా ఉంటుంది. దుర్గాదేవి తెల్లని బట్టలు ధరించి, తెల్లటి ఎద్దును నడుపుతున్నట్లుగా చూపబడుతుంది. పరమేశ్వరుని భర్తగా పొందుటకు కఠోర తపస్సు ఆచరించి ఈశ్వరుడిని వివాహమాడిన అవతారం.
ఈమె అనుగ్రహముతో సాధకునికి వైవాహిక సుఖసంతోషాలు, సుఖమయసంసార జీవనం కలుగుతుంది. అన్నిరకాల వైవాహిక దోషాలూ తొలగుతాయి.అమ్మవారిని గులాబీ రంగు వస్త్రాలు ధరించి అర్చించి "బెల్లం"తో చేసిన "క్షీరాన్నం" నైవేద్య మివ్వాలి. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొనేవారు గులాబీ రంగు వస్త్రాలు ధరించి వెళితే మంచిది.
ఓం శ్వేతవృష సమారూఢా
శ్వేతాంబర ధరా శుచిః
మహాగౌరీ శుభం దద్యాత్
మహాదేవ ప్రమోదదా'
పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడంకోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది. కాబట్టి, ఆమె రాజ భవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి, అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్కచేకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగింది. దాంతో పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటుచేసుకుంది. చివరికి, శివుడు ఆమెముందు ప్రత్యక్షమై, ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడి వేసిన జుట్టు నుండి వెలువడే గంగా నది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు. గంగ పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు