1వ రోజు..

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి, 26వ తేదీ సోమవారం.

ఆశ్వయుజమాస శరన్నవరాత్రులు, ప్రారంభమయ్యాయి. అమ్మవారి (శక్తి) అనుగ్రహం సంపాదించుకోవడానికి విశేషమైన రోజులు. మొదటి రోజైన ఈరోజున అమ్మవారి తొమ్మిది రూపాల్లోని మొదటిదైన

"శైలపుత్రీ"

దేవిగా అర్చించాలి.


హిమవంతునికి కుమార్తెగా జన్మించి తీవ్ర తపస్సుతో శివుని మెప్పించి వివాహమాడిన అవతారం.

ఈమెని పూజించుటవల్ల సాధకుడికి భౌతిక ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది.ఈ అమ్మవారిని పసుపురంగు వస్త్రాలు ధరించి,అర్చించి "కట్టుపొంగలి" నైవేద్య మివ్వాలి.గుడికి వెళ్ళి దర్శనం చేసుకొనేవారు పసుపురంగు వస్త్రధారణ చేస్తే మంచిది.

శైలపుత్రీ దుర్గా ధ్యాన శ్లోకం:

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం
వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్.

"వృషభాన్ని అధిరోహించి, కిరీటంలో చంద్రవంకను ధరించి, యశశ్శు కలిగి, భక్తుల మనః వాంఛలను తీర్చే మాతా శైలపుత్రీ దుర్గా దేవికి నా నమస్కారం అర్పిస్తున్నాను." అని శ్లోకానికి అర్ధం.

శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టీ ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. సతీ, భవానీ, పార్వతి, హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ అమ్మవారికి. శివుని భార్య, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీ దేవినే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్తూ పార్వతీ దేవి అవతారమే శైలపుత్రీ దుర్గా. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చింది. కాబట్టే నవరాత్రుల మొదటిరోజు శైలపుత్రీ దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఆయుధములు- త్రిశూలం, కమలం వాహనం-వృషభం.


No. of visitors till now

website counter code