1వ రోజు..

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి, 26వ తేదీ సోమవారం.

అమ్మవారి ఉత్సవాల్లో ఇదే తొలి రోజు. ఈ రోజున బెజవాడ కనకదుర్గ అమ్మవారు

స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి

గా భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ రోజు అమ్మను ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించుకోవాలి. ఎందుకంటే ఎరుపు ఉత్తేజానికి సంకేతం అంటారు. అలాగే నైవేద్యంగా కట్టు పొంగలి, చలివిడి, వడపప్పు, పాయసం పెట్టాలి.శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి స్వర్ణ కవచం వైశిష్ట్యం శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తారు.


పూర్వం మాధవవర్మ అనే మహారాజు ధర్మనిరతికిమెచ్చి శ్రీ అమ్మవారు (దుర్గాదేవి) విజయవాటికాపురి నందు కనకవర్షం కురిపించిందని అప్పటినుండి శ్రీ అమ్మవారు కనకదుర్గగా కొలవబడుతూ దసరా మహోత్సవములలో స్వర్ణ కవచాలంకృత శ్రీదుర్గాదేవిగా అలంకరించటం జరుగుతున్నది. అటువంటి తల్లిని దర్శించటం వలన సకల దారిద్ర్యములు నశించును. శ్రీకనకదుర్గ అమ్మవారు దర్శనం

శుభదాయకం! ఆనంద దాయకం! ఐశ్వర్యప్రదాయకం!


పఠించాల్సిన శ్లోకం

మాతర్మే మధు కైటభఘ్ని మహిష ప్రాణాప హారోద్యమే
హేలా నిర్మిత ధూమ్రలోచన వధే, హేచండ ముండార్దిని!
నిశ్శేషీకృత రక్తబీజ దనుజే! నిత్యే! నిశుంభావహే
శుంభధ్వంసిని సంహారాశు దురితం దుర్గే - నమస్తేంబికే!!

పురాణ గాథ

స్వర్ణకవచ అలంకృత దుర్గా దేవి రూపం ఎలా వచ్చిందంటే.. దుర్గముడు అనే రాక్షసుడి ఘోర తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అని అడగ్గా.."నాకు వేదములన్నీ వశము కావాలి ", దేవతలను జయించాలి " అని అన్నాడు. అప్పుడు చతుర్ముఖుడు తధాస్తు అనక తప్పలేదు. వేదాలన్నీ దుర్గముడిలోకి ప్రవేశించాయి..బ్రాహ్మణులంతా వేదాలు మర్చిపోయారు, సంధ్యావందనాలు లేవు, యజ్ఞయాగాలు లేవు, దేవతలకు హవిస్సు లేక విలవిల్లాడిపోయారు. దేవతలు సంతృప్తి చెందకపోవడంతో వర్షాలు లేవు, పంటలు లేవు భూమండలం అంతా క్షీణించిపోయింది. జనులంతా నాశనమైపోతుంటే దుర్గముడు సంతోషిస్తాడు. అప్పుడు దేవతలంతా కలసి అమ్మని ప్రార్థిస్తారు. అలా ప్రత్యక్షమైన మొట్టమొదటి అమ్మ స్వరూపానికి " శతాక్షి " అని పేరు పెట్టారు.

ఒంటి నిండా కళ్లతో దర్శనమిచ్చిన శతాక్షి అమ్మ..దేవతల ఆవేదనంతా విని..మిమ్మల్ని చూసేందుకు ఇన్ని కళ్లు పెట్టుకుని ఉన్నాను ఎందుకు భయం అని అభయం ఇచ్చింది. అప్పుడు అమ్మవారు..తన ఒంటినిండా ఉన్న కళ్లనుంచి నీరు కారుస్తూ బ్రహ్మాండం అంతా కరుణరసాన్ని నింపేసింది. అప్పటికప్పుడే మళ్లీ పరిస్థితులన్నీ మారిపోయాయి. యజ్ఞయాగాదులు లేక హవిస్సు సమర్పించకపోవడం వల్ల ఆకలిగా ఉందమ్మా..నిన్ను స్తుతి చేయడానికి కూడా ఓపిక లేదని అనడంతో శాకాంబరిదేవిగా అవతరించింది అమ్మవారు. అందరికి పళ్ళు,కాయగూరలు ఇచ్చింది. మళ్లీ హోమాలు మొదలయ్యాయి, యజ్ఞాలు జరిగాయి..దేవతలకు హవిస్సు వచ్చింది.

ఎండి నీరసపడిపోయిన బ్రహ్మాండం అంతా మళ్ళీ చిగిరించడం చూసి దుర్గముడు ఆలోచనలో పడతాడు. అమ్మ అందరికి అన్నం పెడ్తోంది అని దుర్గముడుకి తెలిసింది. దుర్గముడితో యుద్ధానికి సిద్ధమైన అమ్మ..ముందు దేవతలందరకీ రక్షణ కవచం వేసి పదకొండు రోజుల పాటూ యుద్ధం చేసి దుర్గముడి బాధనుంచి విముక్తి కల్పించింది, వేదాలను రక్షించింది. దేవతలకు రక్షణ కవచం వేసి అందర్నీ కాపాడినందునే నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మని " స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి" రూపంలో పూజిస్తారు.


No. of visitors till now

website counter code