5వ రోజు..

30-09-22 -శుక్రవారం - పంచమి

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత , రాజరాజేశ్వరి ) దశ మహావిద్యలలో ఒక స్వరూపము. సాక్ష్యాత్ ఆది పరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయసు కల, పదహారు వివిధ కోరికలు కలది కావు షోడసి అని వ్యవహరిస్తారు.త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం.అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు

అమ్మ వారి రూపం

శ్రీ చక్రం పై ఎడమ పాదమును మోపి చెరుకు తో చేసిన విల్లు, పుష్ప బాణములు, ఉరి తాడు, కొరడా లని పట్టుకొని ఆసీనురాలై ఉన్న త్రిపుర సుందరి.

పూజా విధానం

లలితా త్రిపుర సుందరి దేవికి ఈ రోజు ఎరుపురంగు వస్త్రాలను ధరించి పూజిస్తే శుభం కలుగుతుందారు. లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి నైవేద్యం దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అందులో పెరుగు, మిరియాలు, జీలకర్రను ఉపయోగిస్తారు. మిరియాలు మన శరీరంలోని వేడిని పెంచి కఫాన్ని తగ్గిస్తుంది. ఇలా లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజిస్తే కుటుంబపరంగాను..శారీరకంగాను..మానసికంగా మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.




5వ రోజు..

30-09-22 -శుక్రవారం - పంచమి

స్కందమాతా

స్కందమాత దుర్గా, నవదుర్గల్లో ఐదో అమ్మవారైన స్కంధమాత దుర్గాదేవి అవతారాలలో 5వ అవతారం. కార్తికేయుని మరో పేరు స్కంధ నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. నవరాత్రులలో ఐదవరోజైన ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.

అమ్మ వారి రూపం

నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది. చేతిలో కమలం, జలకలశం, ఘంటా ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా, స్కందుడు(కుమారస్వామి) ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతా దేవి.

ధ్యాన శ్లోకం

"సింహాసనగతా నిత్యం
పద్మాశ్రిత కరద్వయా
శుభమస్తు సదా దేవీ
స్కందమాతా యశస్వినీ"

పురాణ గాథ

స్కందపురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివ, పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల(కొన్ని కోట్ల సంవత్సరాలు) కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తరువాత, వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశ్యంతో ఇంద్రుడు, ఇతర దేవతలు కలసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈ లోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లుపొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు పోషించగా, కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు, ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండతూ ఉండమని, ఇది మంచి, ఇది చెడూ అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమనీ శాపం ఇచ్చింది. ఇంతలో అక్కడకు వచ్చిన శివుడు ఆమెను శాంతించమనీ, కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చినా, ఆ తేజస్సు తనది కాబట్టీ ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాశానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టీ కార్తికేయుడనీ, రెల్లు పొద(శరవణాలు)లో ఉన్నాడు కాబట్టీ శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివ, పార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకుని, అతనిపై యుద్ధం ప్రకటించి, దేవతల సేనకు అధ్యక్షుడై అతణ్ణి సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవ సేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభు, నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాతా దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది.


No. of visitors till now

website counter code